Friday, September 25, 2009

ప్రతిరూపం!!



నాలుగు రోడ్ల కూడలిలో
నెలవంక వెన్నెల లోగిలిలో
నిస్సహాయ నవ్వుతో నడుస్తున్న నాకు
నిశ్చల నిరుపయోగ నీటి గుంటలో
నిస్తేజ నిషార్తిలా ఎదురుపడ్డావు నువ్వు

నీ ముఖంలో విరిసిన భయంకర నిర్మలత్వం
అలలేని కడలివలె
కలలేని కనులవలె తోచింది

నీ కన్నుల్లో ఆరిన నిశాంత దీపం
నీ చూపుల్లో జారిన ఆశాంత జలపాతం
నన్ను నాకు ఙ్ఞప్తికి తెచ్చింది

ఆ నిర్మానుష్యంలో
ఆ నిర్విరామ నీరవంలో
ఆ రాకాసి రాత్రి ఒడిలో
నా గత ఙ్ఞాపకాల శిథిలాలు ఏరుకొందామనుకొంటే,
నిర్దయ నిశ్చల నిజం
నిర్జీవ నిరాశ రాయిని విసిరి,
నీ రూపాని చెరిపింది!!
నా శాపాన్ని చూపింది!!