Saturday, October 07, 2006

"పాత్ర-యాత్ర"

అంతా ముగిసింది
నిన్నటి వరకు అందుకోవాలనే లక్ష్యాలు
నేటి నుంచి అదుపులో లేని భయాలు
నిన్నటి తలపు, నవ్వుల వలపు
ఒక్క చీకటి మలుపుతో ముగిసాయి
నిన్న రాత్రి చీకటి జీవితమంతా కమ్మేసింది
తన గుండె నొప్పి, నా గుండెకు కోత మిగిల్చింది
తను విడిచిన తుది శ్వాస, నేను మునిగిన పెను తూఫానయ్యింది.
ఒంటిపైన తెలుపు నా జీవితంలో నలుపుకు నిదర్శనం అయ్యింది
మా లోగిలిలో పూసిన పూలకు రక్షణ పోయింది
తెగిన బంధం కదిలే కాళ్ళకు కదలనివ్వని బంధనం అయ్యింది


నిన్నటి వరకు అన్ని నచ్చిన పాత్రలే
ఒక బిడ్డగ, ఒక అక్కగ, ఒక చెల్లిగ,
ఒక భార్యగ, ఒక కోడలిగ, ఒక తల్లిగ
నేటి నుచి కొత్త పాత్ర,
కాదు మిగిలిన పాత్ర,
కన్నీళ్ళతో కడవరకు యాత్ర
ఒక వితంతువుగా
ఈ పాత్ర నేను పోషించగలనా??
ఈ పాత్ర నన్ను పోషించగలదా??

"खयाल"

दूर नजर तक मषाल है
जेहन मे बिन्जवाब के सवाल है
दिल मे एक हि खयाल है
हे दोस्त, तेरा क्या हाल है!!

"ఇదే'నా' జీవితం"

తెల్లారింది,
పక్షుల కిల కిల రావం వినపడలేదు
సూర్యుడి తొలికిరణం తాకలేదు
కాని అలారం కూత ఆగలేదు
మళ్ళీ పరుపులు వీడి పరుగులతో
అరుపులు కూడిన ఉరుకులతో మొదలయ్యింది ఉదయం...

ఆఫీసులో రెండు పూటలా రెక్కలు తెగేలా పని
రెండు చేతులా లెక్కలేని మనీ
రెండు మెతుకులు తినలేని శని

ఇంతలో సాయంత్రం,
మళ్ళీవంతెన దాటిన వరదలా
అడవిన ఆగని దానావలంలా
జాతర నుండి గూటికి పయనం
అక్కడితో ఆగని కూటి సమరం

రాత్రివేళ,
చల్లని గాలిలో, మెత్తటి పరుపులో విశ్రమించుటకు మూసిన నయనం..
చీకటి ధ్వనికి రేపటి పనికికలవరంతో కనుమరుగైన శయనం
ఇదే నా జీవితం!!!
ఇదేనా జీవితం!!!

"పయనం"

ఆఖరికి పయనం మొదలయ్యింది
ఎన్నో యేళ్ళుగా
చలనం లేని గమనంలా అనిపించే
శూన్యంలో ఖననంలా కనిపించే
నా జీవితంలో,
కదలిక కోరిన కాళ్ళు చేసే సంచలనం
మళ్ళీ శ్వాస కోసం మనసు పడే ఆరాటం
కరువు నిండిన గుండెలో కన్నీళ్ళ వర్షం
అమ్మ ఒడిని తాకాలని ఆకాశంలో పయనం.

"మా వ్రాతలు"

మా వ్రాతలు,
నలుగురి నోటిలొ కోయిల కూత కాకపోయినా,
నీటి పైన రాసిన గీత కాకూడదు
చెవిటివాడి చెవిలో మోగే మోత కాకపోయినా,
నీరసం తెప్పించే రోత కాకుడదు
నలుగురికి నిజం చెప్పే వాత కాకపోయినా,
మారుతున్న కాలంలో మరిచిపొయే నీత కాకుడదు.

చెదిరిన ఆశలు చిగురించే లత కావలి
పేదవాడి గుండెలో బంగారపు పూత కావాలి
ఒంటరిగానంలో గోడు వినే శ్రోత కావలి
వెన్నెల మంటలలో తోడునిచ్చే దూత కావాలి.

"పగటికల"

మిట్ట మధ్యాహ్నాం,
కళ్ళు మూయగానే కనిపించిందొక కల
కలలో కనిపించి కనిపించక గిలిగింతలు పెట్టే కన్నెపిల్ల

బాపు బొమ్మ స్నేహలా,
ఈవీవీ గుమ్మ ఊహలా,
జున్ను తేనేల ఊరించే జూహిలా,
మతిపోగొట్టి మత్తులో ముంచెత్తే మనీషాలా,
రంగీలాలో రంగులు నింపిన 'ఊర్మీ'లా,
పదహారేళ్ళకే పొంగులు నిండిన 'చార్మీ'లా,
సూర్య గుండెలో వెలుగుతున్న జ్యొతికలా
కమల్ కళ్ళలో ఆరిన సారికలా,
శ్రీమతిలా కనిపించి, మనమతి పోగొట్టే సౌందర్యలా,
నాభి అనే ఊబిలో దింపి ఉర్రూతలూగించిన రమ్యలా,

ఇంతలో
జలగల పీడిస్తున్న నా మిత్రుడి గొల,
కళ్ళు తెరిచి చూస్తే వాల్ పొస్టర్ లో "షకీలా"!!!

"తను"

తన అడుగు జలజల
తన పాట గలగల
తన నవ్వు కిలకిల
తన కోపం సలసల
తనకోసమే విలవిల
తను లేని నేను వెలవెల

"జననం"

ఒక వైపు,
తీరాన్ని తాకలనుకొనే అలలు, ఆ అలల అడుగున కరిగే శిలలు
ఆకాశాన్నే అంటే గిరులు, గిరులపై పచ్చని తరులు, తరులలో దాగిన విరులు
నేలను పందిరిలా కప్పినా అంబరం, అంబరాన్ని అలంకరించిన పక్షుల సంబరం
నింగిన విడిచి నేలను తాకె ముత్యంలా చిరుజల్లు, నింగిని నేలను కలిపే మార్గంలా హరివిల్లు
అలుపును మరిపించే కోయిల రాగం, వలపులు కురిపించే అమ్మ అనురాగం

మరో వైపు,
కళ్ళలోనే మిగిలిన కలలు, వాటి వేటలో తెగిన తలలు
మురిపించి, మరిపించి, మసిచేసే అరులు, నిండుపున్నమిలోను తొలగని ఇరులు
కాంతులతో భ్రాంతులలో కనపడని కుళ్ళు, క్షామంలో క్షేమంకై క్షోభించే కళ్ళు
కులం కోరల్లో చిక్కిన గోకులం, మతం పేరుతో ఆగని కలకలం
కూటి నుండి కాటి వరకు తప్పని పోరాటం, వెలి అయినా బలి అయినా ఆరని ఆరటం

వీటి మధ్య,
కోయిల కూతకు, కప్పల మోతకు తేడా తెలియక
అర్థం కాని బాణిలో, అలుపెరుగని వాణితో
'కేర్' 'కేర్' మంటున్నది ఎందుకో!!

అమ్మ ఒడి తాకినందుకో!!
ప్రకృతి మడిలో పూచినందుకో!!
గర్భగుడి వీడినందుకో!!
దుర్భల సుడిలో దూకినందుకో!!

ఎందుకో,
ఆ సడి ఎందుకో!!
ఆ తడి ఎందుకో!!

పిలుపు

ఆఖరికి పిలుపు వచ్చింది,
ఊబిలోంచి బయటపడ్డ కప్పలా ఆనందం
పంజరంలోంచి తప్పించుకొన్న చిలకలా ఆనందం
ఎడారి యానంలో ఒయాసిస్సు తాకినంతా ఆనందం
గుక్కపట్టి ఎడుస్తున్న చంటిపాపకు చందమామ అందినంత ఆనందం.

నాతొ పాటు నలభై మంది ఉన్నా,
నా అరుపే వినిపిచింది.
ఆఖరికి పిలుపు వచ్చింది,
జీవితం అనే పెద్ద మలుపు ముగిసింది.

నువ్వు-నేను

ఎడారి దాహం నేను
చిరునవ్వుల జలపాతం నువ్వు
మూగవాడి ఆర్తనాదంలా నేను
సరిగమల సంగీతంలా నువ్వు
అమావాస్య చీకటిలా నేను
ఉదయించిన ఉషస్సులా నువ్వు
వికటించిన నలపాకంలా నేను
వికసించిన సుమగంధంలా నువ్వు

నువ్వు లేని నేను, శ్వాస లేని జీవితం
ఖననం కాని శల్యం, మరణం కోరే శవం

చావు-బ్రతుకు

దూరంగా ఉన్నా ఎప్పటికీ వీడనిది - చావు
మనతోనే ఉన్నా ఎప్పటికి తొడవనిది - బ్రతుకు

ఆశ

నీవులేని ఈక్షణం జగమంత నిశ్శబ్దం
వసంతం వచ్చినా పూలు పూయలెదు..
వర్షం వచ్చినా నీటి తడి లెదు..
కళ్ళు మూసినా కల కనపడదు
కను తెరిచినా చీకటి వీడదు
అన్నీ తెలిసినా శ్వాస వీడలేదు
రేపటిపైన ఆశ చావలేదు

Wednesday, September 27, 2006

"ఓ సాయంత్రం"

ఆ సాయంత్రం,
రోడ్డుకు ఒక వైపు నేను మరో వైపు నువ్వు,
కాళ్ళు చెరొవైపుకు కదులుతున్న, చూపులు మాత్రం నిలిచిపోయాయి!!
నిన్ను చూసిన క్షణం ఎన్నేన్నొ ఊహలు, ఎవేవొ తలపులు

పున్నమి చంద్రుడిలాంటి నీ వదనం
కొలనులో కమలంలా నీ నయనం
పారే జలపాతంలా నీ దరహాసం
వంపులు తిరిగే నదిలా నీ గమనం...

ఇంక ఎన్నేన్నో...
అలోచనల మధ్యలో ఒక ఎలక్ట్రిక్ పోలు
నెత్తురుతొ, నొప్పితో నిండిన నోరు, ఒక పంటికి వీడ్కోలు
మళ్ళీ అదే నవ్వు వినిపించింది,

మరో సాయంత్రం గడిచింది,
మళ్ళీ చీకటి చేరువయ్యింది...

Monday, September 25, 2006

జీవన దశలు

బాల్యం - సాగర తీరంలో, కాళ్ళను తాకుతున్న అలలను చూస్తు కలలు కనే సుందర వదనం
యవ్వనం - సాగరంలో, సాగరంతో సామరస్యం కోసం చేసే సమరంతో సాగే సాహస గమనం
వృద్ధాప్యం - సేద తీరుతూ, శాంత సాగరంలో సంగమం కోసం సంసిద్ధమయ్యే సోలసిన నయనం.

Friday, September 22, 2006

ఒక యువకుడి శోధన, వేదన, రోదన..

కను మూస్తే కనిపించే కలలొ ఉంటు, కను చూపులొ కుడా కనపడని కన్యక
ఎన్నాళ్ళిల అలుపెరుగక, ఎండ మావులలొ ఎద తడికై ఎదురుచూపులిక...

"జీవితం"

మరణం నా ఆశలకు, ఆశయాలకు ముగింపు కాదు,
రెక్కలు కాలిన, ఆశయం కోసం, పయనం ఆపని, ప్రయత్నం మానని, Phoenix వలె తిరిగిలేస్తా..
అలజడి వీడిన ఒరవడి కోసం
అర్పితమవుతా, అంకితమవుతా, అంకుశమవుతా...

సఖ్యత కోసం సమరం చేస్తా, సమరంలో అమరుణ్ణవుతా
ఓర్పుతో నిలుస్తా, కూర్పుతో కదలుతా, మార్పుకై తపిస్తా, తరిస్తా...

వెయ్యికళ్ళు పొంచి ఉన్న, లక్ష వలలు వేచి ఉన్న
అలుపెరుగని అలల ప్రవహిస్తా, ప్రసరిస్తా, ప్రకాశిస్తా...

లోకం దృష్టిలో లొకువ అయిన, చీకటి తరిమే వేకువనవుతా
ధృతినై, కృతినై, కడ వరకు కృషిస్తా, నశిస్తా...


అయినా,
మరణం నా ఆశలకు, ఆశయాలకు ముగింపు కాదు,
రెక్కలు కాలిన, ఆశయం కోసం, పయనం ఆపని, ప్రయత్నం మానని, Phoenix వలె తిరిగిలేస్తా..