ఒక వైపు,
తీరాన్ని తాకలనుకొనే అలలు, ఆ అలల అడుగున కరిగే శిలలు
ఆకాశాన్నే అంటే గిరులు, గిరులపై పచ్చని తరులు, తరులలో దాగిన విరులు
నేలను పందిరిలా కప్పినా అంబరం, అంబరాన్ని అలంకరించిన పక్షుల సంబరం
నింగిన విడిచి నేలను తాకె ముత్యంలా చిరుజల్లు, నింగిని నేలను కలిపే మార్గంలా హరివిల్లు
అలుపును మరిపించే కోయిల రాగం, వలపులు కురిపించే అమ్మ అనురాగం
మరో వైపు,
కళ్ళలోనే మిగిలిన కలలు, వాటి వేటలో తెగిన తలలు
మురిపించి, మరిపించి, మసిచేసే అరులు, నిండుపున్నమిలోను తొలగని ఇరులు
కాంతులతో భ్రాంతులలో కనపడని కుళ్ళు, క్షామంలో క్షేమంకై క్షోభించే కళ్ళు
కులం కోరల్లో చిక్కిన గోకులం, మతం పేరుతో ఆగని కలకలం
కూటి నుండి కాటి వరకు తప్పని పోరాటం, వెలి అయినా బలి అయినా ఆరని ఆరటం
వీటి మధ్య,
కోయిల కూతకు, కప్పల మోతకు తేడా తెలియక
అర్థం కాని బాణిలో, అలుపెరుగని వాణితో
'కేర్' 'కేర్' మంటున్నది ఎందుకో!!
అమ్మ ఒడి తాకినందుకో!!
ప్రకృతి మడిలో పూచినందుకో!!
గర్భగుడి వీడినందుకో!!
దుర్భల సుడిలో దూకినందుకో!!
ఎందుకో,
ఆ సడి ఎందుకో!!
ఆ తడి ఎందుకో!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment