Tuesday, April 17, 2007

మధ్యతరగతి "మహానుభావుడు".


మధ్యతరగతి జీవితాలు బ్రతకనివ్వవు, చావనివ్వవు. ఎందుకంటే, హాయిగా చావాలన్న, బాధ లేకుండా బ్రతకాలన్న కావలిసింది ధైర్యం, లేదా ఆత్మ విశ్వాసం లేదా రేపటి పైన నమ్మకం. ఇవన్ని ఉంటే మధ్య తరగతి బండి లాగాల్సిన పని ఉండదు. అందుకే ఒక మహానుభావుడు అన్నట్టుగా, ఒక సగటు జీవి (మన దేశంలో సగటు జీవికి అర్థం ఒకటో తేదిన జీతం తీసుకొని, ఒక వారం తరువాత అప్పుల కోసం వెదికేవాడు అని, అంటే మధ్యతరగతి భారతీయుడు) కళ్ళు ఉన్నత వర్గాలపైన ఉన్న, కాళ్ళు మాత్రం పేదరికం లొనే పాతుకుపోతాయి. కాని కొందరి వైభవం వీరి పేదరికం పునాదులపైనే పుట్టింది. (కొందరు ఎందుకంటే మధ్యతరగతి తొ పోలిస్తే ధనవంతులు తక్కువే కదా, సంఖ్యలో) మార్కెట్టులో ప్రతి ఉత్పత్తిదారుడి గురి వీరి వైపే. వీరి సంపాదన ఖర్చు పెట్టించడమే వాళ్ళ లక్ష్యము. కలలు కనడం ఎంత పాపమో ఖర్చు పెట్టేంత వరకు తెలుసుకొలేడు ఈ వెర్రిబాగులోడు. కొంటే దరిద్రుడు అవుతాడు, కొనకపోతే చేతకాని వాడిలాగ మిగిలిపోతాడు. బాధలలో తక్కువ బాధను ఎంచుకో(లేని)నేస్థితిలో ఎదో ఒకటి ఇష్ట పడతాడు, నష్ట పోతాడు. ఇలా తనకంటు ఆధారం లేని ఈ జీవిపైనే దేశం ఆర్థిక స్థితిగతులు ఆధారపడి ఉంటాయి.

ఇలా జీవితంలో ప్రతి అడుగు లెక్కలు వేస్తు మునగడమే తప్ప, బయట పడే మార్గం దొరకదు. అనివార్యామైన మునకను ఆలస్యం చేయడం మాత్రమే నేర్చుకొంటాడు. ఇతడికి ఎంచేసినా అసంతృప్తే మిగులుతుంది. ఉద్యోగవేతనం విలాసాలకు కాదు కదా, రోజువారి జీవితానికి కుడా కష్టమే. ఇలా అని, దండిగా లంచం సంపాయించే ధైర్యం లేదు. (ఉంటే మధ్యతరగతిలో మగ్గేవాడు కాదు) ఇక ఈ చాలిచాలని సంపాదనతో ఇంట్లొ వాళ్ళ కనీస కోరికలు తీర్చలేక వాళ్ళు కార్చే కన్నీరులో నలుసు లాగ కారిపోతాడు, రాలిపోతాడు. (కనీస కోరికలు కోరిన కుటుంబ సభ్యుల తప్పేమి లేదు) ఇలాంటి ఈ బలహీనుడి జీవితం ఎంత సేపు ఇంట్లో కష్టాలు, ఉద్యోగంలో ఒత్తిడిల గురించి తలమునకలవడంలో ముగుస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడం కాదు కదా ఆలొచించడమే కష్టం అవుతుంది.

ఇన్ని కష్టాలు కన్నీళ్ళతో ముందుకు నడిపిస్తున్న (కుంటుతూ) ఈ జీవికి చావు బ్రతుకుల మధ్య తేడ తెలియదు. అందుకే మహకవి శ్రిశ్రి అన్నట్టు


"ఇటు చూస్తే అప్పులవాళ్ళూ

అటు చూస్తే బిడ్డల ఆకలి

ఉరిపోసుకుచనిపోవడమో

సముద్రాన పడిపోవడమో

సమస్యగ ఘనిభవించిన్

దొక సంసారికి.... "


సమస్యలకు ఎదురొడ్డి పొరాడే శక్తి చాలక, సమస్యల వలయంలో బలహీనుడిగ మిగలడం ఇష్టంలేక, ఆత్మాభిమానానికి అతీతంగ ఆత్మవంచనకు అలవాటుపడి బ్రతుకు(ను) "సాగ"దీస్తాడు, ఈ మధ్యతరగతి మహానుభావుడు.

No comments: