Thursday, January 01, 2009

२००९!!


రైల్వే స్తేషన్ క్రిక్కిరిసి ఉంది. ప్లాట్ ఫారం అంతా గోల గోలగా ఉంది. అర్థం కాని మాటల వరద ఎడతెరిపి కురుస్తుంది. ఒకవైపు ఎదురుచూచి అలిసిన ప్రయాణికుల నిరాశను పారద్రోలడానికి మైకులో ఒక గొంతు ప్రయాసలు పడుతుంది. ఇంకో వైపు టీవీలో ప్రయాణికుల నిస్తేజాన్ని నిర్ములనకై ఒక అమ్మాయి తెగ పాట్లు పడుతుంది. అలా మాటల వరద, మూటల బురద దాటుతూ మంచినీళ్ళ కొళాయి వేటలో పడ్డాను. ఇందాక దిగిన రైలులో నీళ్ళు ఎంత తాగిన దాహం తీరం లేదు. బహుశ నీళ్ళు మంచివి కావు అనుకొంటా, లేదా నా దాహం సముద్రంలా విశాలం, ఎదో ఒకటి!! ఎది ఎమైనా, ముందు మంచి నీళ్ళు కావాలి.

అలా ముందుకు నడిచాను. నడిచాను అనడం కంటే పాకాను అంటాను. ఇసుకేస్తే రాలనంత జనం, అతిశయోక్తి అయిన దాదాపు అలానే ఉంది. అందరు వారి వారి మాటల్లో మునిగి ఉన్నారు. అలా వెళ్తూ ఉండగా, ఇద్దరు నడివయస్సు మహిళలు 'ఈ ట్రైన్ అయిన రావల్సిన టైంకి వస్తుందా. ఇందాకటిది బాగా ఆలస్యమయ్యింది. ముందు వస్తే ఇలా జరుగకపొయేదేమో?, దానికి బదులుగా, 'లోకంలో ఎప్పుడు జరగనట్టు అంటున్నావే, ఇప్పుడు ఈ ట్రైన్ రావల్సిన టైంకి వచ్చినా, అనుకొన్న పనులు అవుతాయా?' అప్రయత్నాంగానే వాళ్ళ మాటలు నా చెవిన పడ్డాయి. ఇద్దరిలో ఒక ఆవిడ ఆవిరి అయిన నమ్మకం వెనక దాగిఉన్న ఒక ఆశ బిందువుని చూడలని ఆరాటపడుతుంది, ఇంకో ఆవిడ ఎడారి ప్రయాణంలో ఒయాసిస్సు దాహం తీర్చదు అంటుంది. తను ఎన్ని కష్టాలు తరువాత ఈ నిర్ణాయనికి వచ్చిందో!! ఎన్ని కష్టాలు అనుభవించిన, భవితపైన ఆశ ఉండాలి, అనుకొంటూ, అదే ఆశను నమ్ముకొన్న నేను, ఆ స్తేషన్లో నీళ్ళు దొరుకుతాయని ముందుకు కదిలాను.

నేను నడుస్తున్న స్టేషన్ భాగం చిందర వందరగా కనిపించింది. ఎక్కడికి అక్కడ గుంపులు గుంపులుగా మనుషులు, అలాంటి గుంపులు అన్నీ కలిసి జన సందోహంలాగ అనిపించింది. ఏ గుంపు కూడా ఇంకో గుంపులా లేదు, కాని తారతమ్యం లేని విధంగా కలిసిపొయారు. ఈ స్టేషన్ అందరిని కలిపే ఒక సేథువులాగ ఉంది. అందరు ఎదో ఒక పనిలో నిమఙ్ఞమై ఉన్నారు. కొందరి మాటలు ఢిల్లి కోటను కుడా దాటేసాయి. మరి కొందరివి పక్కనున్న సేటును కూడ దాటలేకపొయాయి. ఒక అమ్మ, అమ్మాయి గొలలో పడి విలువైన వస్తువు ఇంతకు ముందరి ట్రైన్లో మర్చిపొయిన తన కొడుకు భాగోతం చెప్తుంది. అది వినడానికి, విని బాధపడడానికి కొడుకు అక్కడలేదు, బహుశ వేటలో ఉన్నాడు అనుకొంటా!! ఒక అయ్య తను కష్టపడి సంపాదించిన ట్రైన్ టిక్కెట్ కథను చెప్తున్నాడు, యువకులకు స్పూర్థి ఇవ్వాలని ఒక ఆశ కాబోలు!! ఒక యువకుల గుంపు నిన్న రాత్రి జరిగిన క్రికెట్ గురించి చర్చిస్తున్నారు, అది చర్చ మరియు వాదనల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టుంది. కొందరు మాత్రం ఇవేమి పట్టనట్టుగా పత్రిక చదువుతున్నరు, కొందరు ప్రకటనలు వింటున్నారు, పిల్లలు పరుగులు తీస్తున్నారు. మరి కొందరు ఖాళీగా కుర్చున్నారు, కాని వాళ్ళ కళ్ళలో ఎదో కనిపించని బాధ, ఎదో దాచుకోలేని వ్యధ, ఎవరో దోచుకున్నారు అన్న సొద వినిపిస్తుంది. వీరి కళ్ళకు రాబోయె ట్రైన్ పైన నమ్మకంలేదు, ఆశ లేదు, ఆతృత అస్సలు లేదు. వారికి ఈ ప్రపంచం అంతా మోసమే అనిపిస్తుంది. కాని గట్టిగా గొంతు విప్పి చెప్పలేని మాటలు నేర్చిన మూగవాళ్ళు. అలా ఆలోచిస్తు దూరంగ కనిపించే కొళాయి వైపు తిరిగాను. నేను ఇంకా బ్రతికే ఉన్నాను అన్నట్టుగ బొట్లు బొట్లుగా కారుతుంది కొళాయి, అ బొట్లను ఏరుకొని దాహాన్ని దాటలనుకొనే నా లాంటి వాళ్ళు నలభై మంది కనిపించారు ఆ కొళాయి ముందు. నాకు ఆశ సన్నగిల్లింది, దాహం బలపడింది, నీళ్ళ గోల గగ్గొలుపెట్టింది.

అలా ఆ గందరగోళం నుంచి ముందుకు కదిలాను. నా దాహం ఇంకా ఎక్కువయ్యింది. మెల్లిగా జన సందోహం సన్నగిల్లింది. మాటల సడి కాస్త వర్షం నుంచి జల్లులకు తగ్గింది. అక్కడ నడక చాలా సునయాసంగా ఉంది కాని కాళ్ళకే దూరం ఎక్కువ అనిపిస్తుంది. బాదరబంది లేదు. చుట్టూ జనాల గోల లేదు. చెట్టుకు అక్కడక్కడ కాసిన కాయాల లాగ, చిన్న చిన్న గుంపుల్లొ ఉన్నారు. ఒక గుంపు ఇంకో గుంపుతో కలుపుగోలుగా లేదు. అందరి కళ్ళలో మెరుపులు కనిపిస్తున్నాయి. ఎక్కడ అమావాస్య చీకట్ల ఛాయలు లేవు. అందరి మొహాలపైన చెరగని చిరునవ్వు వాడని పువ్వులాగ (ప్లాస్టిక్ పువ్వులాగ) వెలుగుతూ ఉంది. కాని అందరి చూపులో ఒక శోధన. ఎండమావిలో నీళ్ళకై వెతికే బాటసారి చూపులు అవి. అందరికి కనిపించే జ్యోతి వెలుగు వెనక కాలే వొత్తి రూపంలా ఉంది వాళ్ళ వేషం. రాబోయే ట్రైన్ కి సన్నాహాలు జోరుగ ఉన్నాయి. వీరికి ప్రతి ట్రైన్లో తమకై కేటాయించిన వసతులు ఉంటాయి. వీరి వసతులకు మిగత జనాల బెడద అసలే ఉండదు. అందుకే పొయిన ట్రైన్ రాబొయే ట్రైన్ మధ్య వీరికి పెద్దగ తేడా కనిపించదు. ఇలా ఆలోచనల మధ్య మల్లి దాహం నన్ను రెక్క పట్టి లాక్కొని వచ్చింది రైల్వే ప్లాట్ ఫారం పైకి. అక్కడ చూస్తే నీళ్ళు సీసాల్లొ అమ్ముతున్నారు. అవి కొనే తాహతు, సాహసం నా దాహానికి లేదు. అందులోను నా దాహం ఖరీదు కేవలం నా ప్రాణమే. నా ప్రాణం విలువ నేను నడుస్తున్న చొట చాలా చవక!!

అలాగే ముందుకు నడుస్తున్నా, నీళ్ళకై!! దోసిలిలో దాగిన నీళ్ళతో సేదతీరే నన్ను నేను చూసుకొవాలనే తపనతో. ప్లాట్ ఫారం చివరకు వచ్చేసాను అనుకొంటా, మెల్లిగా గుంపులు కూడ తగ్గిపొయాయి. ఆకాడక్కడ విసిరి పారేసినట్టుగ, విధి వెలి వేసినట్టుగా గట్టుకొకరు చెట్టుకొకరు కనిపించారు. వారి తలరాతలలాగే అతికి అతికని చిరిగిన బట్టలు, శివుడి ఝటాఝుటాలను మరిపించే చెదిరిన జుట్టు, సప్తఋషుల మాదిరి పొడవాటి నెరిసిన గడ్డం, ఆకలి మంటతో రెందు అంచులు కలిసిన కడుపు, ఆశల వలయంలో బూడిద తిన్న సాక్షిగా నల్లగ మెరుస్తున్న నాలిక, వారి కళ్ళలో మాత్రం కనిపించని కల, కాదు కాదు.. కనిపించే కలి. ఆ కళ్ళు మాత్రం నాకు అర్థం కావట్లేదు. ఒక కంటిలో బాధ, భయం, జాలి, దయ, క్రోధం, కోపం, ఆహం, ఆశ నిరాశ అన్ని కలగలిసి జీవితపు ఆకాశాన్ని తాకలనే కడలి అలలాగ ఎగిసిపడుతున్నాయి. ఇంకో కంటిలో ఇవేమి లేవు, కనిపించేది కేవలం శూన్యమే!! వారికి గమ్యం లేదు, కేవలం మజిలీలు మాత్రమే. వారికి ఉన్నదల్లా గగనం మాత్రమే, వారు నేర్చిందల్ల గమనం మాత్రమే. వారికి ట్రైన్ పైన ధ్యాసలేదు. వారికి జీవితం ఎక్కడైన ఒకటే. జీవితం ఎక్కదైన వారికి ఎండిన చెరువే.

అందుకే నీళ్ళు వెతికే ప్రయత్నం మానుకొన్నాను. కాని నా దాహం నన్ను వీడలేదు. నాలిక నాలుగు చుక్కల తడికి నలుదిక్కుల చూస్తుంది. ఇంతలో మైకులొ ఏదొ వినిపించింది. ఇక్కడ మైకులొ చెప్పేది బాగ వినిపిస్తుంది. మొదట దిగిన చోట, ఆ జనాల గోలలో అర్థం కాక, అందరితో పాటే మనం అనుకొని ఉన్నాను. ఆ తరువాత ఆ ఖరీదైన భాగంలో, వారికి అంతరాయం కలుగకుండా రాకపోకలను వివరించేవారున్నారు. నా లాంటి వాళ్ళు సమాచార లేమితో బ్రతకాలి అక్కడ. ఇకా ఈ చివరన, అందరికి అర్థం అయ్యేల బాగా వినిపిస్తుంది, కాని వినేవాళ్ళే కరువయ్యారు.

ఇక విషయానికి వస్తే, ఇంకాసేపట్లో నేను (మేము) ఎక్కాల్సిన ట్రైన్ రాబోతుంది. నా దాహం మాత్రం తీరలేదు. ఇక వేరే గత్యంతరం లేక, రాబొయె ట్రైన్లో నా "భవి"త నా దాహం తీరుస్తుందని ఆశతో ట్రైన్ వైపు కదిలాను. ఇంతకు మీకు ట్రైన్ పేరు చెప్పలేదు కదూ.. అదే, 2009!!

1 comment:

Hazare said...

Chala Baagundi Nishanth Gaaru...Ilanti rachanalanu bavishyattlo kooda maaku andajestarani ma chirakala korika...

itlu
Hazare