Friday, April 17, 2009

అభిప్రాయాంబుధి !!


చాలా రోజులుగా నా వ్రాతలు ఆగిపోయాయి. ఇలా ఆగిపోయిన ప్రతిసారి, నన్ను నేను అడిగే ప్రశ్న, అయిపొయిందా నా తృష్న? ఈ సందేహం నా ఆహాన్ని దెబ్బతీసిందేమో కాని నా దాహాన్ని తీర్చలేకపొయింది. నాలో కలిగే అనుభూతులకు, నాలో రేగే అలోచనలకు ఒక రూపం ఇవ్వాలన్న నా ఆసక్తిని ఆపలేకపొయింది. నా అభిప్రాయలకు ఎదో ఒక రూపం ఇవ్వాలన్న నా తపన, ఎలాగైన ఒక రూపం ఇవ్వాలన్న నా తొందరపాటును ఎప్పుడు తరిమివేస్తూనే ఉంది. ఏదో ఒక రూపం ఇవ్వడానికి, ఎలాగైన రూపం ఇవ్వడానికి చాలా తేడా ఉంది. ఎదో రూపం ఇచ్చే ప్రయత్నంతో మొదలుపెట్టి, ఎలాగైన రూపం ఇచ్చే దశకు చేరుకొన్న నన్ను నేను చూసి, అసంతృప్తితో, ఆవేదనతో, నిరాశతో, నిస్తేజంతో నిర్లిప్తంగా వెనుదిరిగిన రోజులు కోకొల్లలు.

కొన్ని అభిప్రాయలు రాయిపైన చెక్కని శిల్పాల వలె మిగిలిపొతాయి. కొన్ని అలోచనలు ఆకుని తాకని బిందువులాగ కరిగిపొతాయి. ప్రతి మనిషి ప్రతి సంధర్భానికి, ప్రతి సమస్యకి, ప్రతి సన్నివేషానికి ఒక నిర్దిష్ట అభిప్రాయాన్ని, లేదా ఒక నిర్దిష్ట స్పందనను ఏర్పర్చుకొంటాడు. ఇలాంటి, ఈ ఏర్పర్చుకొన్న స్పందన వారి వారి అవగాహన, వారి వారి అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. ఇలా అందరిలోను పుట్టిన అభిప్రాయాలు అందరికి వినబడవు, దానికి కారణాలు చాలా ఉన్నాయి. కొందరు వ్యక్త పర్చలేరు, కొందరికి వ్యక్త పర్చడం వ్యక్తిత్వం కాదు. ఇలా పరిసరాలు, పరిస్థితులు పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తే అన్ని అభిప్రాయాలు అందలం ఎందుకు ఎక్కవో అర్థం అవుతుంది.

మనలో పుట్టే అభిప్రాయాలు, విరివనములో స్వేచ్చగా విహరించే సీతకొకచిలుకలవంటివి కొన్ని, ఇంకా రూపాంతరత చెందని గొంగళిపురుగులా క్లుప్తంగా, వీడి వీడని మత్తులా, మబ్బుల వెనక దాగిన జాబిలిలా కొన్ని. అన్ని అభిప్రాయాలు అందరికి తెలియాలా? తెలియనక్కర్లేదు, తెలిసినా తప్పులేదు. అన్ని తెలిసినా, మనిషి తనకు నచ్చింది మాత్రమే తనతో మోసుకెళ్తాడు. లేదా ముందు అన్నట్టు, తెలియనక్కర్లేదు, ఎందుకంటే నాలో కలిగే వెయ్యి అలోచనల ఫలితం నేను రాసే ఈ పది రాతలు మాత్రమే!! ఇలా కలిగిన వెయ్యి అలోచనలలో, చాలా మటుకు తల తోక తెలియక పుట్టినవే. లేదా నాకు తికమక కలిగించినవే. కొన్ని నాకు అర్థం అయిన నేను అందరికి అర్థం అయ్యేలా చెప్పలేనివి. కొన్ని నేను రాయలేనివి, కొన్ని నేను రాయకూడనివి. ఇలా నాకు కలిగిన అనంతమైన అలోచనల నుంచి, అవధులులేని అభిప్రాయాల నుండి, రూపంతరత చెందిన, నేను అర్ధం చేసుకొన్న, నలుగురికి అర్థం అయ్యేలా చెప్పగలిగే నాలుగు పదాలను రాయడానికి పట్టే వ్యవధి కొన్ని సార్లు తీరాలను దూరం చేసిన అగాధంలా అనిపించినా, సన్నిహితుల ప్రొత్సాహం, సదా నాలో ఉరకలేసే ఉత్సాహం, తీరం తాకి వచ్చిన అలల స్పర్షలా అనిపించి, నన్ను, నా అవ్యక్త భావాలాకు ఒక రూపాన్ని కలిగించేలా చేస్తుంది, దాని ఫలితమే మీరు చదివిన ఈ పదాల మంజరి, నాలో మ్రోగిన అనుభూతి మువ్వల లాహిరి.

No comments: