Tuesday, June 19, 2007

పెళ్ళి చూపులు...


ఆఖరికి పెదనాన్న ఇంటికి చేరుకొన్నాము. ఆ ట్రాఫిక్ లో ఉన్నంత సేపు సరైన సమయానికి చేరుకొంటామో లేదో అని ఒకటే బెంగ అమ్మ, వదినలకు. అనుకొన్నటైముకు చేరుకున్న అలవాటు ప్రకారం పెదనాన్న, 'ఎంటమ్మా! ఇంత లేటు' అన్నారు. అలా అన్న మరుక్షణమే నన్ను తొందరగ మొహం కడుక్కొని తెమలమని నస మొదలయ్యింది. ఇక వాళ్ళ పోరు భరించలేక బాత్ రూము లోకి దూరాను. కాని ఒక చెవి మాత్రము బయటి మాటలను వింటూనే ఉంది. పద్ధతి ప్రకారం ఏమేమి తీసుకొని వెళ్ళాలో వివరిస్తున్నారు పెదనాన్న.

పెదనాన్న మరియు అమ్మాయి తండ్రి, ముప్పై ఏళ్ళ నుంచి మంచి మిత్రులట. ఈ సంబంధం గురించి చెప్పగానే అమ్మాయిని చూడాల్సిన అవసరం లేదు ఏకంగా పెళ్ళి ముహుర్తం పెట్టుకొందాము అని ఒకటే గొడవ. ఆఖరికి నా బాధను అర్థం చేసుకొన్న నాన్న, పెదనాన్న కు వివరంగా వివరించాక ఒకసారి మాట్లాడడానికి ఒప్పుకొన్నారు. తనకు రావడం కుదరదంటూ బాధ్యత అంతా పెదనాన్నకు అప్పగించారు నాన్న. నా పరిస్థితి ఇప్పుదు వెనుక నుయ్యి ముందు గొయ్యి లాగ అయ్యింది. చూడకుండ పెళ్ళి చేసుకొలేను అలాగని చూసినతరువత నచ్చకపోతే, పెదనాన్న నన్ను తన సెంటిమెంటు సముద్రములో ముంచేలా ఉన్నాడు.

'ఇంకెంతసేపు రా!' అంటు తలుపు కొట్టాడు అన్నయ్య. తను నచ్చిన అమ్మాయిని చేసుకొన్న అన్నయ్య కేమి తెలుసు నా బాధ, అనుకొంటూనే 'వస్తున్న' అంటూ బయటికి వెళ్ళాను. 'ఇవిగో కొత్త బట్టలు' అంటు చెల్లి కొన్ని టిప్స్ ఇచ్చి వెళ్ళింది. కాని నా పరిస్థితి ఎవరికి చెప్పేది. పాతికేళ్ళుగ ఎదురుచూస్తున్న ఘడియ రానే వచ్చింది, ఈ పరీక్ష ఎలా ఉంటుందొ కనీసం పరీక్ష ఏ సబ్జెక్ట్ కూడ తెలియని విధార్థి లాగ తెల్ల మొహం వేసుకొని నేను, పరీక్ష పాస్ అయిన విధ్యార్థులకు పట్టా ఇచ్చేద్దామన్నంత సంతోషంతో పెదనాన్న, మమ్మల్ని అనుసరిస్తు వాళ్ళలో వాళ్ళు గుసుగుసలాడుతూ మిగతా దండు బయల్దేరింది. ఇక దారిపొడగున నాకు వాళ్ళ మైత్రి మమకార కథలతో శ్రవణానందం చేసాడు పెదనాన్న. నీటిని చేరడానికి గట్టు మీది కొట్టుకుంటున్న చేప లాగ ఉంది నా పరిస్థితి.

ఇంతలో ఇల్లు రానే వచ్చింది. తిరుపతి దేవుడిని చూసినంత ఆనందం. కాని లోపల తంతు గుర్తుకు వచ్చి మళ్ళీ గుండె వేగం పుంజుకుంది.

రండి రండి అంటూ బయటికి వచ్చారు అమ్మాయి తండ్రి. పరస్పర పరిచయాలు ముగిసాక, హైదరాబాదు ట్రాఫిక్ ను తిట్టడం అయ్యాక అసలు విషయంలోకి దూకారు, ఆతృతగా, అందరు. ఇక అప్పుడు కురిసింది నా పై ప్రశ్నల వర్షం. నా ఉద్యోగం, నా జీతం, అందులో నా జీవితం, నేను కట్టే పన్నులు, నేను తీయించుకొన్న పన్నులు, నేను తిరిగే బండి, నేను తినే తిండి, నా చుట్టు ఉండే పరిసరాలు, ఆ పరిసరాలలో పారే నదులు, ఆ నదులు వెళ్ళి కలిసే సాగరాలు, అన్ని వివరాలు అడిగారు. నాకు భూగోళంలో ఇంత ప్రవేశం ఉందని నాకే తెలియదు అప్పటిదాక. మరీ బోనులో ముద్దాయిలా కాకుండ అప్పుడప్పుడు నన్ను అడుగు అంటూనే తను చెప్పలనుకొన్నది చెప్పేస్తున్నారు పెదనాన్న. నేను మాత్రం అమ్మాయి తల్లి తండ్రి మొహాలు చూస్తు అమ్మాయి ఎలా ఉంటుందొ ఊహించుకొంటున్నాను. ఇక ఆ ప్రశ్నల వర్షంలో తడిసి ముద్దయ్యాక 'పాప' అంటూ ముద్దుగ పిలిచారు అమ్మాయి తండ్రి. అప్పటివరకు నిరాశతో నిస్తేజంగా ఉన్న నాకు, తెలియని ఆత్రుత అందోళనతో రోమాలు నిక్క పొడుచుకొన్నాయి.

సిగ్గుపడుతూ అమ్మయి బయటికి రానే వచ్చింది. నేను కొంచం ఇబ్బందిగానే, ఇష్టంగానే తలపైకెత్తి చూసున్నాను. తను మాత్రం నన్ను తల వంచుకొని తొంగి చూస్తుంది. ఇంతలో అమ్మ, వదిన మరియు చెల్లి వాళ్ళు అడగాలనుకొని తయారు చేసుకొన్న ప్రశ్నావళి మొదలెట్టారు. అమ్మాయి అణుకువగా, వణుకుతున్న కంఠంతో ఒపికగా జవాబిస్తుంది. అలా సాఫిగా సాగుతున్న తంతులో పెదనాన్న చిన్న అడ్డుపుల్ల వేసారు. మమ్మల్ని,అంటే నన్ను అమ్మాయిని, పక్కకు వెళ్ళి మాట్లాడుకొమన్నారు. నేను ఉత్సాహం చూపకపొయిన ప్రొత్సాహంలా కనిపించిన వారి పోరుకు తట్టుకోలేక నోరు మూసుకొని పక్క గదిలోకి జారుకొన్నాను.

గదిలో ఒక కుర్చీలో నేను తన కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలో తను చేతిలో ఫలహారం, టీ పట్టుకొని లోపలకి వచ్చింది. 'తీసుకోండి' అంటు నా వైపు చూసింది, ఆఖరికి తన 'ముఖారవిందం' చూసే అదృష్టం దక్కింది నాకు. ఇంత సేపు ముక్కు, చెవి, కన్ను, ఇలా ఒక్కొక్క అంగం చూసి, తన రూపం ఊహించుకోలేక పొతున్న నా మట్టి బుర్రకు అర్థం అయ్యేలా, జక్కన ఓపికగా చెక్కిన శిల్పంలా ఉంది. ప్రపంచంలోని అందాన్ని కుప్పగ పోసి, దానితో తయారు చేసిన రూపమే తను. వెళ్ళి పెదనాన్న కాళ్ళు మొక్కాలనిపించింది. ఇలా అందమైన అలోచనల అఘాథంలో మునిగిన నాకు, 'ఏవండి' అన్న పిలుపు వినిపించిది. కలను కట్టిపెట్టి తన కళ్ళను చూస్తు కమ్మని గొంతును అస్వాదించాలనుకొన్నాను. అయితే మొహామాటంతో ముడుచుకుపోయిన తనకు నిర్భయంగా తను చెప్పాలనుకొన్నది చెప్పమన్నాను.

అలా పదిహేను నిముషాలు గడిచాక, 'అన్నయ్య! ఇక వెళదామా' అంటూ చెల్లి తలుపు కొట్టింది. ఇంతలో వదిన 'ఇక ఇంటికి రావా' అంటూ ఆటపట్టించింది. నేను మాత్రం నొట మాట రాక బయటకు నడిచాను. బయట పెదనాన్న నవ్వుతూ స్వాగతం పలికాడు. ఇక అందరు ఆలస్యం అవుతుందని పద్దతి ప్రకారం వీడ్కోలు వ్యవహారం ముగించి పెదనాన్న ఇంటికి బయదేరాము. తిరుగు ప్రయాణం అంత అభిప్రాయ వేదికల నిలయంగా మారింది. నేను మాత్రం శిలా విగ్రహంలా రోడ్డుని చూస్తూ కూర్చున్నాను.

పెదనాన్న ఇంటికి చేరుకొన్నాము. అక్కదే భోజనాలు ముగించి ఇంటికి బయలుదేరాము. ప్రయాణం మధ్యలో సెల్ ఫోను మోగింది. అటువైపు పెదనాన్న, ఇంకొకసారి తన మిత్రుడి గురించి, వాళ్ళ కుటుంబం గురించి, తన మైత్రి గురించి చెప్పి నా నిర్ణయం అడిగాడు. ఇంతలో సిగ్నల్ లేదు అన్నట్టుగ వినిపించట్లేదు అని ఇంటికి వెళ్ళాక ఫోను చేస్తాను అన్నాను, కాని తనకు నేను తగనని చెప్పిన తన అభిప్రాయం గుర్తొచ్చి, మబ్బుల వెనక చంద్రుణ్ణి, చంద్రునిలో దాగని మచ్చను చూస్తు మూగబోయాను.

3 comments:

Santosh said...

A very good description raaaa. Keep it up.

Sakki

Santosh said...

A very good description raaaa. Keep it up.

Sakki

Imran Ali Dina said...

Hi nice blog,

Just one thing about this post is that the image you used is my digital painting. proof of this is
http://iadinaplus.deviantart.com

My name is Imran Ali Dina (IADina)
plz if you use any of my artwork do mention my name in your post.
regardz,
Imran.