Wednesday, November 12, 2008

అదృశ్యరూపం!!


చిన్న త్వరగా లేరా!! అన్న పిలుపులాంటి అమ్మ అరుపుకి కళ్ళు తెరిచాను. ఇంకా ప్రయాణ బడలిక పోలేదు. ఇల్లు చేరుకొని 24 గంటలు అవుతున్నా, ఇంకా గాలిలో ఎగుర్తున్నట్టే ఉంది. ఈ ప్రయాణం అనుకొన్నది కాదు, ఊహించనిది కాదు. అపరాజిత అక్క, పెదనాన్న కూతురు, పెళ్ళి ఇలా హడావుడిగా అవుతుంది అనుకోలేదు. అపరాజిత, ఏ ముహూర్తానా పెదనాన్న ఆ పేరు పెట్టాడో కాని, సార్ధకనామధేయురాలు అనిపించింది, ఈ పెళ్ళి ముహూర్తానికి అందరిని ఒప్పించింది. నేను, అపరాజిత, నాకంటే నాలుగు నెలలు పెద్దది, చిన్నప్పటి నుంచి ఒకే క్లాసు, ఒకే స్కూలు. తను బాగా చదువుకొని డాక్టరు అయ్యింది. నేను ఒక మోస్తారుగా చదువుకొని ఇంజినీరు అయ్యాను. ఆ తరువాత, అందరిలాగే పై చదువులు అంటూ నేను పరదేశం వెళ్ళాను. తను బుద్ధిగా చదువుని ప్రేమించింది, తనను అరిహంత్ ప్రేమించాడు. అందరు తండ్రుల వలె పెదనాన్న మొదట్లో కాదన్నాడు, కాని అక్క కన్నీరు చూడలేక కాదనలేకపొయాడు. అంతస్తులు, అలవాట్లు వేరైనా అంగరంగ వైభవంగా కాకపొయిన, అందరికి అందుబాటులో ఉండేలా ఆలయంలో పెళ్ళి కి, అంగట్లో రిసెప్షన్ కి అన్ని తయారీలు చేసారు.

నాకు అరిహంత్ పరిచయం కాని తన చుట్టరికం గురించి పెద్దగా తెలియదు. అందులోను అమ్మే చెప్పే దుర్గ గురించి!! నిన్నటి నుంచి అమ్మ ఒక పది సార్లు చెప్పింది. దుర్గ, అరిహంత్ బాబాయి కూతురు, గుణవంతురాలు, దుర్గ బుద్ధిమంతురాలు, దుర్గ కుడా అమెరికాలో ఉంది అని. అరిహంత్ అంతే శత్రువలను అంతం చేసే వాడు, చాలా చక్కని పేరు, వినగానే నచ్చేస్తుంది, కాని దుర్గ, పేరు బాగా పాపులర్, కాని కొత్తదనం లేదు. పిచ్చి పలు రకాలు అంటారు, నాకు పేర్ల పిచ్చి. తన పేరు నన్ను బేజారు చేసింది అది కాక నిన్న ప్రయాణంలోని అమ్మాయి హుషారు ఇంకా నా మనసులో షికారు కొడుతూనే ఉంది.

ఈ అమెరికాలో అన్ని టైం ప్రకారం జరగాలి. ఎమర్జెన్సీ అంటే మనల్ని ఉతికి అరేస్తారు. నాకు ఈ పెళ్ళి విషయం కేవలం వారం రొజుల ముందే తెలిసింది. కాని అప్పు(అపరాజిత) పెళ్ళికి నేను వెళ్ళకపోవడం జరగని పని. అందుకే ఖరీదు ఆకాశాన్నంటుతున్న ఆనందంగా ఫ్లైట్ టికెట్టు కొనేసా!! ఆ నాలుగు రోజుల్లో అప్పుకు ఇష్టమైన కొన్ని వస్తువులు కొని, ప్రయాణానికి లగేజీ సిద్ధం చేసాను.

ఆఖరికి బయల్దేరు రోజు వచ్చింది. ఎయిర్ పోర్ట్లో చేయాల్సిన పనులు సవ్యంగానే ముగిసాయి. విమానమెక్కి నా సీట్లో కూర్చున్నాను. ఎప్పటిలాగే కిటికీ పక్కన సీటు. ఎప్పటిలాగే ఒక చేతిలో తిలక్ పుస్తకం ఇంకో చేతిలో Apple I-Pod. ఎప్పటిలాగే పక్క సీట్లో అమ్మాయి రావాలని నమ్మని దేవుణ్ణి కోరుకోవడం. ఎప్పటిలాగే ఒక ముసలాయన (పెద్దాయన అనలేక పొతున్న ఎందుకంటే విరక్తి భావం) వచ్చి కూర్చొవడం, ఎప్పటిలాగే దేవుడు లేదు అని నిర్ధారించుకొని పుస్తకం మూసి పాటలు వింటు కళ్ళు మూసుకోవడం, నన్ను నిరాశ పరచని నిద్ర నన్ను హత్తుకోవడం, వెంట వెంటనే జరగాయి.

హఠాత్తుగా తలపైన ఎవరో కొట్టినట్టు అనిపించింది. దెబ్బకు నిద్ర పారిపొయింది, I-Pod జారిపొయింది. చూస్తే ఒక హ్యాండ్ బ్యాగు. సారీ అంటు పట్టు చీర అంచులాంటి సన్నని గొంతు వినిపించింది, తలపైకెత్తాను. నాకు కలిగించిన అసౌకార్యానికి క్షమాపణతో పాటు అసౌకర్య భావం తన ముఖంలో చూపిస్తు ఒక అమ్మాయి. తన అసౌకర్య భావన కూడా నాలో తెలియని సంతోషాన్ని నింపింది. దేవుడు ఒకే వరంలో అన్ని కోరికలు తీర్చినట్టు అనిపించింది. అమ్మాయిని అడిగితే అందమైన అమ్మాయిని ఇచ్చాడు. వెంటనే 'it's OK' అంటూ జెంటిల్మెన్ వేషం కట్టాను, ఒక వైపు నొప్పి బాధ తిప్పలు పెడుతున్నా!!
(Picture Courtesy: Madhu Shree)

No comments: