Friday, November 21, 2008

నీడ చాటు జాడ!!


"దేనితొ కొలవను పోయినదాన్ని?" ఇంకో సారి అన్నాను,"పోగొట్టుకొన్న వస్తువు విలువ పోయాకే ఎందుకు తెలుస్తుంది?" అడిగాను తనను.

"పొయింది కనుకే విలువయినవి కొన్ని, స్వతహాగ విలువైనవి కొన్ని. దేని విలువ ఎంతో చేతిలో ఉన్నప్పుడే గ్రహించగలిగిన వాడు సమర్థుడు."

"అయితే నేను అసమర్థుడినా?" అడిగాను,"ఇన్నాళ్ళుగా నాలో నలుగురి గుర్తించిన సమర్థత వొట్టి బూటకమా? నలుగురు నాపై కురిపించిన ప్రశంసల జల్లు వొట్టి మాటల మూటలా?"

"నలుగురిని ఎందుకు నీ సమస్యలో లాగడం? నీలో నీకే సంధిగ్ధత? నా విలువ నాకే సరిగ్గ తెలియదని సంశయం!! విలువ అంటే ఎంటి? ఒక వస్తువు కాని, ఒక వ్యక్తి కాని నీ దృష్టిలో సంపాదించుకున్న చోటు. విలువ కేవలం నీకు ఒక వస్తువుపై ఏర్పడిన అభిప్రాయం. అభిప్రాయం మనుసుకు హత్తుకొంటే అభిమతం అవుతుంది, లేదా అసహ్యం అవుతుంది.నీకు ఇప్పుడు నచ్చినది ఇకముందు కుడా నచ్చ్చాలని లేదు. మార్పు సహజం. అభిప్రాయలు మార్పులకు అతీతం కాదు. ఎప్పటికి మారనివి ఆదర్శాలు. అభిప్రాయాల రాళ్ళ పైన అనుభవాల ఉలితో చెక్కిన శిల్పమే ఆదర్శం. నిలకడలేని అభిప్రాయాల ఫలితమే నిశ్చలమైన, నిక్కచ్చియైన ఆదర్శం"

"హుహ్..." అన్న నిట్తూర్పు తప్ప చెప్పడనికి ఏమి లేదు.

"ఇక నీ ఙ్ఞాపకాలు అంటావా, ఇవి కూడ కొన్నాళ్ళే. వస్తున్న శిశిరంలో వాడిపొయి, నీనుంచి విడిపొయి, రానున్న వసంతంలో కొత్త చిగురు తొడుగుతాయి"

అంటున్న నానీడ నవ్వుతో నేను శృతి కలిపుతూ అలాగే ముందుకు సాగాను.. వసంతం కోసం!!

No comments: