Friday, December 05, 2008
అసమర్థుని జీవయాత్ర
అసమర్థుని జీవయాత్ర ఇలా అభినందించే అంతా ఆహ్లాదంగా ఉంటుంది అనుకొలేదు. అసమర్థుడి జీవితాన్ని అద్దంపట్టేల అభివర్ణించారు కవి త్రిపురనేని గోపించంద్. తన భావాలను, తన బాధలను కళ్ళకు కట్టినట్టుగ రాసే శక్తి కొందరికే ఉంటుంది, అందులో ఒకరు గోపిచంద్. ఆలోచనలతో, అనుభవాలతో ఒక వ్యక్తి చేసే పోరాటమే ఈ అసమర్థుని జీవయాత్ర.
కథలోకి వస్తే, కవి సృష్టించిన కథానాయకుడు (కథానాయకుడు అని పిలవడం ఎంత వరకు సమంజసమో తెలియదు) బ్రతుకు భారం మోయలేని, సంసార సాగరం ఈదలేని, సమాజంతో , సమాజంలో వేగలేని అసమర్థుడు. తన ఒటమికి నైతిక బాధ్యత వహించని నిస్సహయుడు. తన వైకల్యానికి సమాజ అఙ్ఞానికి మధ్య తేడాని గుర్తించలేని గుడ్డివాడు. అంధకారంలో అందాలను ఊహించే, వాస్తవికంలో వైరాగ్యం వ్యవహరించే అయోమయుడు. అన్నింటికి మించి తెలివైన పిచ్చ్చోడు. అన్ని తెలిసిన అమాయకుడు. మాయల ప్రపంచంలో మమకారాల శిశిరంలో ఆకువలే రాలిన అభాగ్యుడు. విశాల ప్రపంచంలో విరోధులే లేని జీవితంలో, జీవితానికే విరోధి అయిన అపరాధి. ఇలా ఇన్ని లేములతో కూరుకొన్న ఒక మనిషి జీవితాన్ని వర్ణిస్తూ రాసిన ఈ పుస్తకం నన్ను ఇలా కట్టిపారేస్తుందని అనుకొలేదు. బ్రతుకు ఛిద్రమై, బ్రతకడమే వ్యర్ధమై, బ్రతుకు కేవలం ఒక వ్యసనంలాగ మారిన ఒక వ్యక్తి జీవితం బురదలో దాగిన అందంలా తోచింది.
ఇది ఒక సగటు మనిషి ఆర్తనాదం, ఒక మధ్యతరగతి మహానుభావుడి గావుకేక, చావుకేక. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు, చదివాక అలోచిస్తున్నప్పుడు నన్ను నేను అక్కడక్కడ చూసుకోగలిగాను. నేను చదివిన అమూల్యమైన వాటిలో ఇది ఒకటి. ఈ కథ ద్వారా నాయకుడికి ఒక కొత్త రూపాన్ని ఇచ్చి మూసధోరణికి స్వస్తి పలికారు గోపిచంద్. నిరాశను మాత్రమే వెల్లడిస్తుంది అని మొదట్లో ఈ పుస్తకానికి తగిన గుర్తింపు లభించలేదు. కాని, నిజానికి నిరాశకు తేడా తెలిసిన సమాజం ఈ పుస్తకాన్ని హృదయానికి హత్తుకోక ఉండలేకపొయింది, నా లాగే!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment