Saturday, February 02, 2008

తృప్తి


తెల్లవారితే శనివారం. కాని ఈ రాత్రికి తెర పడేలా లేదు. ప్రతి రోజు తెల్లవారిజామున అలారం మోతకు నిద్ర లేవడానికి బద్ధకించే నేను, ఈ రాత్రి నిద్ర కోసం తపిస్తు, తంటాలు పడుతున్నాను. కన్నీరు పెట్టుకోటానికి కలతలు లేవు, కల్లు మోయలేని కలలు లేవు, అయిన కంటికి కునుకులేదు.

అలా అనుకుంటూనే కంప్యుటర్ వద్దకు వెళ్లాను. నిద్ర కు సహకరిస్తుందేమో అనుకొని పాటలు విందామనుకొన్నాను. బయట చలి. వెన్నులో ప్రవహించి వణుకు పుట్టిస్తుంది. ఇంతలో "lukkaa chuppi" అంటూ పాట మొదలయ్యింది. ఈ సారి నేను చలి కి వణకలేదు. కాని పాట పలకరింపు నాలో వణుకు పుట్టించింది. ఆ వణుకుకు నాలో గడ్డ కట్టుకున్న ఙ్ఞాపకాలు కరిగి నన్ను వెనక్కి తీసుకెళ్ళాయి. నన్ను నా ఇంటికి తీసుకెళ్ళాయి. అలా వెళ్తూ వెళ్తూ తనకు నచ్చిన ఒక సందర్భం వద్ద ఆగిపోయాయి, నన్ను సంధిగ్ధంలో వదిలేసి!

చిన్నప్పుడు మనకు తెలిసిన లోకం చిన్నది కాని పొందిన సంతోషానికి అవధులు లేవు, హద్దులు లేవు. ప్రతి పక్షానికి, అమ్మ నన్ను పిండి మరకు వెళ్ళమని పురమాయించిన సాయంత్రాలు ఇంకా గుర్తున్నాయి. మా ఇంటికి అర కిలోమీటర్ దూరంలో ఉండేది. అలా నడుస్తూ, నా చుట్టు ఉన్న జనాలను చూస్తూ నాలో నేను అనుకొన్న మాటలు ఎన్నో, ఎన్నెన్నో!! పిండి మర వద్ద కూర్చుని పని ముగిసే దాక రోడ్డు పైన వెళ్ళే ప్రతి కారు, ప్రతి మోటర్ సైకిల్ పేరు చదువుతూ, లెక్కపెడుతూ గడిపిన ఆ క్షణాలు, జీవితం ఇలాగే గడిచిపోతుందేమో అనుకొన్న నా ఊహ (అందులోని తీయదనం ఇప్పుడు తెలుస్తుంది), అంతే తప్ప వాటిని సంపాయించాలి, సొంతం చేసుకోవాలి అన్న ఆలోచనకూడ తట్టేది కాదు. అలా పని ముగించికుని ఇంటికి వస్తే, అమ్మ నాకు ఒక్క రూపాయి ఇచ్చేది. ఆ రుపాయి తీసుకొని నేను సరాసరి గుజరాతీ చాట్ భండార్ వద్ద కు పరుగు తీసే వాణ్ణి. ఆ రుపాయి తో అయిదు పానిపూరిలు (గప్ చుప్) తినేవాణ్ణి. అలా తినే నాకు ఆ రోజు స్వర్గం నిచ్చెన ఎక్కినంత ఆనందం. లోకాలను జయించినంత గర్వం. కాసేపు గాలిలో ఎగురుతూ చందమామ ని తాకినంత తృప్తి.

అదే సంతోషం, అదే తృప్తి కోసం రోజు తపిస్తున్న ఇప్పుడు. ఇప్పుడు పూటకు వంద రూపాయల పానిఫూరి లను తిన్నా ఆ తృప్తి ని పొందలేక పొతున్నాను. ఎక్కడికి వెళ్ళిన, ఎమి చేసిన తీరని వెలితి, నాలో, నాతో సదా!! ఎదో ఒక తెలియని అసంతృప్తి. ఈ జన సందోహంలో నన్ను నేను ఎక్కడో వదిలిపెట్టి వచ్చానన్న ఒక బాధ, మళ్ళి తిరిగి నాకు నేను దొరకనేమో అని ఒక భయం.

తిలక్ అన్నట్టు,

"ఆ రోజుల్ని తలుచుకొన్నప్పుడల్లా

ఆనందం లాంటి విచారం కలుగుతుంది

నేటి హేమంత శిథిల పత్రాల మధ్య నిలిచి

నాటి వాసంత సమీర ప్రసారాల తలచి

ఇంతేగదా జీవితం అన్న చింత

ఇంతలోనే ముగిసిందన్న వంత."

అంతలో పాట ఆగిపోయింది. నిశ్శబ్దం కమ్ముకుంది. నిశ్శబ్దం నన్ను, నా ఙ్ఞాపకాలను రెక్క పట్టుకుని లాక్కొచ్చింది. నిశ్శబ్దం మళ్ళీ నిర్జీవ జన సమూహంలోకి నెట్టేసింది.

బయట చలి. వెన్నులో ప్రవహించి వణుకు పుట్టిస్తుంది. ఈ వణుకు ఖచ్చితంగా చలిదే!!

No comments: